సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్

16-08-2021 Mon 17:40
  • అసభ్య కామెంట్లకు చెక్
  • అసభ్య కామెంట్లు చేయబోతే వార్నింగ్
  • కామెంట్లు, మెసేజిలకు పరిమితి
Instagram launches new feature
ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే సోషల్ మీడియా వేదికల్లో ఇన్‌స్టాగ్రామ్ కూడా ఒకటి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఈ వేదికను ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు.. ఇన్‌స్టా వేదికగా అసభ్యకర కామెంట్లు చేయడం, మెసేజిలు పంపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు.

ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ ప్రకటించింది. దీని పేరే ‘లిమిట్స్’. ఇది మన పోస్టులకు ఎవరైనా అసభ్యకర కామెంట్లు పెడుతున్నా, దుర్భాషలాడుతున్నా వారికి హెచ్చరికలు చేస్తుంది. అలాగే మన పోస్టులపై కనిపించే కామెంట్లకు, మెసేజి రిక్వెస్టులకు పరిమితులు విధిస్తుంది. ఇంకా మన ఫాలోవర్లు కాని వారి నుంచి వచ్చే కామెంట్లు, మెసేజి రిక్వెస్ట్‌లను కనిపించకుండా హైడ్ చేస్తుందట.

ఈ విషయాన్ని ఒక పత్రికా ప్రకటనలో ఇన్‌స్టాగ్రామ్ వెల్లడించింది. ‘‘సెలెబ్రిటీల విషయంలో జరిగే నెగిటివ్ ప్రచారం ఎక్కువగా వారి ఫాలోవర్లు కాని వారి నుంచే మొదలవుతుంది. ఇలాంటి వాటిని ఆపడం లేదంటే నియంత్రించడం కోసమే ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఈ పబ్లిక్ ఫిగర్లకు రక్షణ కల్పించడం కోసమే దీన్ని తీసుకొచ్చాం’’ అని ఇన్‌స్టాగ్రామ్ పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ లిమిట్స్ ఫీచర్ అందుబాటులో ఉందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది. ప్రైవసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి దీన్ని ఆన్ చేసుకుంటే చాలని వివరించింది. ఈ ఫీచర్‌ను ముందుగా కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ ఇది అందుబాటులోకి వచ్చింది.