అమెరికా విమానానికి వేళ్లాడిన ఆఫ్ఘన్లు... గాల్లోంచి జారిపడి ముగ్గురి మృతి

16-08-2021 Mon 17:34
  • కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు
  • ఎయిర్ పోర్టులో బాధాకరమైన దృశ్యాలు
  • దేశం విడిచి వెళ్లేందుకు ఆఫ్ఘన్ల యత్నం
  • అమెరికా సైనిక విమానం వెంట పరుగులు
  • ప్రమాదమని తెలిసీ సాహసం!
Three Afghans died in Kabul
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి విమానాశ్రయంలో అసాధారణ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. తాలిబన్ల నరకప్రాయమైన పాలన నుంచి తప్పించుకుని పారిపోయేందుకు వందలాది ఆఫ్ఘన్లు కాబూల్ ఎయిర్ పోర్టులోకి చొరబడి, కనిపించిన ప్రతి విమానాన్ని ఎక్కేందుకు ప్రయత్నించారు. అమెరికా దళాలు తమ సీ-17 గ్లోబ్ మాస్టర్ రవాణా విమానంలో తరలి వెళుతుండగా, దాన్ని కూడా వెంబడించారు. అత్యంత ప్రాణాంతకం అని తెలిసి కూడా ఆ విమానాన్ని పట్టుకుని వేళ్లాడే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో ముగ్గురు ఆఫ్ఘన్ పౌరులు గాల్లోంచి జారిపడి మృతి చెందారు. అటు, అమెరికా బలగాల కాల్పుల్లో మరో ఐదుగురు చనిపోవడం తెలిసిందే. కాగా, ఆఫ్ఘన్లు అమెరికా సీ-17 విమానంతో పాటే పరుగులు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ కలచివేస్తోంది. తాలిబన్ల పట్ల ఆఫ్ఘన్ల మనోభావాలను ఈ వీడియో ప్రతిబింబిస్తోంది.