పోలీస్ స్టేషన్ లో భోజనం కూడా ముట్టని నారా లోకేశ్

16-08-2021 Mon 17:28
  • రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్
  • అరెస్ట్ చేసి, ప్రత్తిపాడు పీఎస్ కు తరలించిన పోలీసులు
  • పోలీస్ స్టేషన్ లో ఆందోళనకు దిగిన లోకేశ్
Nara Lokesh not taken food in Prathipadu Police Station
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని ఇతర టీడీపీ నేతలతో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లోకేశ్ తో పాటు ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా తదితర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేశ్ ను అక్కడి నుంచి ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు, ఇతర నేతలను నల్లపాడు పీఎస్ కు తరలించారు.  

మరోవైపు పోలీసుల తీరును నిరసిస్తూ ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లోనే నారా లోకేశ్ ఆందోళనకు దిగారు. పరామర్శించడానికి వెళ్లినవారిని ఎలా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. అరెస్ట్ కు నిరసనగా మధ్యాహ్నం భోజనాన్ని కూడా ఆయన ముట్టలేదు. ఇంకోవైపు ప్రత్తిపాడు పీఎస్ ఎదుట పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు గుమికూడారు. రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.