రమ్యను హత్య చేసిన శశికృష్ణ తల్లి స్పందన

16-08-2021 Mon 17:08
  • నా కొడుకు చేసిన పనికి శిక్ష పడాల్సిందే
  • రమ్యకు, నా కొడుకుకి పరిచయం ఉన్న సంగతి తెలియదు
  • కొన్ని రోజులుగా తనలోతాను కుమిలిపోతున్నాడు
Ramya murder accused Sasikrishnas mothers reaction
బీటెక్ విద్యార్థిని రమ్యను గుంటూరు కాకానిలో ఒక ఉన్మాది దారుణంగా హతమార్చిన ఘటన భయాందోళనలను రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిందితుడు శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ దారుణంపై శశికృష్ణ తల్లి స్పందించారు. ఒక అమ్మాయి జీవితాన్ని అంతం చేయడం తన కొడుకు చేసిన తప్పేనని ఆమె అన్నారు. తన కొడుకు చేసిన పనికి తగిన శిక్ష పడాల్సిందేనని చెప్పారు. ఎవరి బిడ్డ అయినా ఒకటేనని అన్నారు.

రమ్యకు, తన కుమారుడికి ఉన్న పరిచయం గురించి తనకు తెలియదని ఆమె చెప్పారు. అయితే శశికృష్ణ గత కొన్ని రోజులుగా తనలోతాను ఎందుకో కులిమిపోతున్నాడని తెలిపారు. అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం, ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండటం చేశాడని చెప్పారు. ఏదేమైనప్పటికీ రమ్యను హత్య చేసిన తన కొడుక్కి శిక్ష పడాల్సిందేనని అన్నారు. మరోవైపు రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన నారా లోకేశ్ తో పాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.