Taliban: భారత్ వైఖరి మార్చుకుంటుందని ఆశిస్తున్నాం: తాలిబన్లు

  • రెండు దేశాలకూ మంచి జరగాలంటే అదొక్కటే మార్గం
  • ఇతర దేశాల సహకారం కోరిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్
  • అధ్యక్షుడు పారిపోవడంతో తాలిబన్ల వశమైన కాబూల్
Hope India will alter stance says Taliban spokesman

ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ దేశాన్ని వశం చేసుకున్న తాలిబన్లు.. తమకు భారత దేశం మద్దతిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాలిబన్ అధికార ప్రతినిధి షహీన్ సుహైల్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తాలిబన్ పాలనకు, ఈసారి పాలన భిన్నంగా ఉంటుందని అన్నారు. ఇంతకుముందు కంటే వేరుగా తాము పరిపాలన ఎలా కొనసాగించబోతున్నారో ఆయన వివరించారు. విదేశీ సహకారానికి సంబంధించి తీసుకోబోతున్న చర్యల గురించి కూడా మాట్లాడారు.

ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సుహైల్.. ఆఫ్ఘనిస్థాన్‌ను తాము పునర్నిర్మించబోతున్నామని, అందుకు సహకరించాలని మిగిలిన దేశాలను కోరారు. ఈ క్రమంలోనే భారత్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. తమకు మద్దతునివ్వాలని కోరారు. ‘భారత్ ఇంతకుముందు ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం పడిపోయింది. భారత్ కూడా తన వైఖరి మార్చుకుంటుందని ఆశిస్తున్నాం. అలా జరిగితేనే ఇరు దేశాలకు, ఇరు దేశాల ప్రజలకూ మంచిది’ అని సుహైల్ పేర్కొన్నారు.

అలాగే తమ సేనలు కాబూల్‌లోకి ప్రవేశించాయని, అక్కడి భద్రతకు భంగం కలుగకుండా ఉండేందుకు, ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లకుండా పరిరక్షించేందుకు, ప్రజల ప్రాణాలు పోకుండా రక్షించేందుకు నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నామని సుహైల్ వెల్లడించారు.

ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.. దేశం విడిచి వెళ్లిపోయిన నేపథ్యంలో తాలిబన్లు ఆదివారం ‌దేశ రాజధాని కాబూల్‌ను హస్తగతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, ఇండియా వంటి దేశాలు ఆఫ్ఘన్‌లోని తమ ప్రజలను తిరిగి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.

More Telugu News