దళిత విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళితే ఇంత అతిగా ప్రవర్తిస్తారా?: సోమిరెడ్డి

16-08-2021 Mon 16:09
  • గుంటూరులో బీటెక్ విద్యార్థిని హత్య
  • పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ నేతలు
  • లోకేశ్ సహా తమ నేతలను అరెస్ట్ చేశారన్న సోమిరెడ్డి
  • ఆనంద్ బాబుపై ఎస్పీ చేయిచేసుకున్నాడని ఆరోపణ
Somireddy fires on police
గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని నారా లోకేశ్ తదితర టీడీపీ నేతలు పరామర్శించేందుకు వెళ్లిన నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దీనిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గుంటూరులో టీడీపీ నేతలపై పోలీసు జులుంను ఖండిస్తున్నాను అంటూ ప్రకటన చేశారు. హత్యకు గురైన దళిత విద్యార్థిని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళితే ఇంత అతిగా ప్రవర్తిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నారా లోకేశ్ తో పాటు ముఖ్యనేతలందరినీ అరెస్ట్ చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనం అని విమర్శించారు. మాజీ మంత్రి, దళిత నాయకుడు నక్కా ఆనంద్ బాబుపై ఎస్పీ చేయిచేసుకోవడం దుర్మార్గం అని మండిపడ్డారు. మీడియా ప్రతినిధులతోనూ దురుసుగా ప్రవర్తించి కెమెరాలు పగులగొట్టారని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అని ప్రశ్నించారు. పరిధి దాటి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని సోమిరెడ్డి హెచ్చరించారు.