CM KCR: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న దళితులకు కూడా దళితబంధు వర్తిస్తుంది: సీఎం కేసీఆర్

  • హుజూరాబాద్ లో దళితబంధు ప్రారంభం
  • సీఎం కేసీఆర్ ప్రసంగం
  • హుజూరాబాద్ లో 21 వేల దళిత కుటుంబాలు
  • అందరికీ దళితబంధు వర్తిస్తుందని వెల్లడి
CM KCR speech at Huzurabad rally

హుజూరాబాద్ లో దళిత బంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్ ఆసక్తికర ప్రసంగం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 21 వేల దళిత కుటుంబాలు ఉన్నట్టు సర్వే చెబుతోందని, ఒకవేళ కొత్తగా పెళ్లిళ్లు జరిగుంటే మరికొన్ని కుటుంబాలు అదనంగా ఉండొచ్చేమోనని అన్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా... అందరికీ ఇచ్చే దమ్ము కేసీఆర్ కు ఉంది అని వ్యాఖ్యానించారు.

రాబోయే రెండు నెలల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళిత కుటుంబానికి డబ్బులు ఇస్తామని సభాముఖంగా ప్రకటించారు. "ఎల్లయ్యకు ఇస్తారు, మల్లయ్యకు ఇవ్వరు అనే సమస్యే లేదు.... హుజూరాబాద్ లో అందరికీ ఇస్తారు. 25 ఏళ్ల కిందటే సిద్ధిపేట దళిత చైతన్య జ్యోతి అని దళిత బంధుకు అప్పుడే బీజం వేశాం. నేను అప్పుడు సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నాను. రసమయి బాలకిషన్ తో కలిసి అనేక పాటలు తీసుకువచ్చాం. నేను ఎమ్మెల్యే అయితే మొదటి సంతకంతో ఒక దళితుడికి మేలు చేయాలని భావించాను. నా క్లాస్ మేట్ దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్ ను చేశాను. ఆయన ఇటీవలే కన్నుమూశారు.

దళితులను పైకి తీసుకురావాలన్న మా లక్ష్యం కొత్తదేమీ కాదు. చారి అని నాడు ఆంధ్రప్రభలో పనిచేసిన జర్నలిస్టుతో కలిసి ప్రపంచవ్యాప్తంగా అణగారిన జాతులు ఎన్ని ఉన్నాయని అధ్యయనం చేశాం. మనదేశంలో దళితుల్లాగా సామాజిక వివక్షకు గురైన జాతులు ప్రపంచవ్యాప్తంగా 165 అని వెల్లడైంది. ఎలాంటి అవకాశాలు లేక అణగారి పోయారు. మన దేశంలో అంబేద్కర్ వల్ల కొందరు అభివృద్ధి సాధించారు. ఇంకా చాలామంది అభివృద్ధికి ఆమడదూరంలోనే నిలిచిపోయారు.

హుజూరాబాద్ వంటి బాదులు ఇంకా చాలా ఉన్నాయి. రెండు నెలల్లో హుజూరాబాద్ అంతా దళితబంధు ఇస్తాం. అక్కడితో మీ పని అయిపోతుంది... నా పని మాత్రం ఇంకా మిగిలే ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లోనూ దళితబంధును ఇచ్చేందుకు నేను ఎంతో చేయాల్సి ఉంది.

రాష్ట్రంలో 17 లక్షల పైచిలుకు దళిత కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ దళిత బంధు ఎలా వస్తుంది? అంటున్నారు. రైతు బంధు తరహాలోనే దళితబంధు కూడా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి దళిత సోదరులకు కూడా దళితబంధు వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మాత్రం చివరి వరుసలో దళితబంధు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఆకలితో ఉన్నవాళ్లకు, ఇల్లూ వాకిలీ లేని వాళ్లకు మొదటి వరుసలో, ఆ తర్వాత కొంచెం మెరుగ్గా ఉన్నవాళ్లు, చివరలో ఉద్యోగులు దళితబంధు తీసుకోవాలి" అని స్పష్టం చేశారు.

More Telugu News