Afghanistan: స్నాక్స్ తప్ప ఏమీ తినలేరు... ఘనమైన నేపథ్యం నుంచి పతనం దాకా... ఇదీ ఘనీ ప్రస్థానం!

  • కేన్సర్ వల్ల జీర్ణాశయంలో కొంతభాగం తొలగింపు  
  • ముక్కోపిగా పేరు.. ‘నేనే’ అన్న అహంకారం
  • అమెరికా చేతిలో కీలుబొమ్మగా మారిన వైనం
  • తాలిబన్లతో చర్చలు జరుపుతున్నా మౌనం
  • తిరుగుబాటుదార్లను విడుదల చేసినా ఏమీ చేయలేనితనం
Ashraf Ghani Cant Eat Full Meals

అంతకుముందు ఎవరూ చేయలేనిది తాను చేశానంటూ అప్పట్లో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ గొప్పలకు పోయారు. కానీ, ఇప్పుడు తన రాజ్యం కళ్లముందే కకావికలమవుతున్నా ఏం చేయలేకపోయారు. ఘనమైన నేపథ్యం నుంచి పతనంలోకి జారిపోయారు. ఆయన కళ్ల ముందే ఎంతో అవినీతి జరిగినా ఆపలేకపోయారన్నది ముమ్మాటికీ నిజం. చివరికి తాలిబన్ల నుంచి తప్పించుకుని దేశం విడిచి వెళ్లిపోయారు. పైగా, రక్తపాతాన్ని నివారించేందుకే వెళ్లిపోయానని ఆయన చెప్పుకున్నారు.

తాలిబన్లతో అమెరికా ప్రభుత్వం చర్చలు జరుపుతున్నా.. కీలు బొమ్మలా ఉండిపోయారే తప్ప మారుమాటైనా మాట్లాడలేకపోయారు. 5 వేల మంది తిరుగుబాటుదారులను అమెరికా వదిలేస్తున్నా చడీ చప్పుడు లేకుండా పడి ఉన్నారు. అధ్యక్షుడిగా చివరి రోజుల్లో టీవీ ప్రసంగాలకు పరిమితమయ్యారే తప్ప.. ప్రజలతో మాట్లాడింది, వారికి దగ్గరైంది లేదు. ఆయనకు ముక్కోపిగా పేరు.

వాస్తవానికి 2014లో దేశాధ్యక్షుడిగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన.. అమెరికాలో విద్యావేత్తగా, ఆర్థికవేత్తగా పనిచేశారు. 2014లో దేశ పునర్నిర్మాణం పేరుతో అధికారం చేపట్టారు. ఆఫ్ఘనిస్థాన్.. సోవియట్ చేతిలో బందీగా ఉన్న 1980ల్లో న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో ఆయన చదువుకున్నారు. 1991 నుంచి ప్రపంచ బ్యాంకులో కొన్నేళ్ల పాటు ఉద్యోగం చేశారు. రష్యా బొగ్గు పరిశ్రమపై పరిశోధన చేశారు. 2001లో ఐరాస ప్రత్యేక సలహాదారుగా కాబూల్ కు వచ్చారు.

2002 నుంచి 2004 వరకు హమీద్ కర్జాయి అధ్యక్షతన ఉన్న మధ్యంతర ప్రభుత్వంలో ఘనీ ఆర్థిక మంత్రిగా కొనసాగారు. కొత్త కరెన్సీ, పన్ను వ్యవస్థ, ధనిక ఆఫ్ఘనీలు దేశానికి తిరిగొచ్చేందుకు ప్రోత్సాహం వంటి గుణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే, తానే గొప్ప అనే అహంకారంతో ఎవరినీ దగ్గరకు కూడా రానివ్వలేదు. ఆయన కోపం, అహంకారమే ఆయన పతనానికి దారి తీసిందని అంటున్నారు.

ఇక, లెబనాన్ లోని అమెరికన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివేటప్పుడు పరిచయమైన రూలాను ఘనీ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. తర్వాత కేన్సర్ వచ్చి ఆయన జీర్ణాశయంలో కొంత భాగాన్ని తీసేశారు. దీంతో ఆయన ఏదీ ఎక్కువ తినలేరు. మంచి ఆహారం తీసుకోలేరు. తింటే అరగదు. దీంతో ఆయన స్నాక్స్ తప్ప ఏవీ తినరు. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2014లో గెలిచారు. వెంటనే ఉజ్బెకిస్థాన్ కు చెందిన వార్ లార్డ్ జనరల్ అబ్దుల్ రషీద్ దోస్తుమ్ ను సహచరుడిగా ప్రకటించారు.

More Telugu News