ఎస్బీఐ నుంచి స్పెషల్​ డిపాజిట్​ స్కీమ్​.. వడ్డీ రేట్లను పెంచిన బ్యాంక్​.. ఆఫర్​ కొన్ని రోజులే

16-08-2021 Mon 14:39
  • ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్స్ స్కీమ్
  • 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పథకం
  • వచ్చే నెల 14 వరకేనన్న ఎస్బీఐ
  • 0.15% వరకు వడ్డీ పెంపు
SBI Brings New Deposits Scheme On 75th Independence Day
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఓ కొత్త డిపాజిట్ పథకాన్ని తీసుకొచ్చింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఎస్బీఐ ప్లాటినం డిపాజిట్స్’ను తెచ్చింది. కేవలం సెప్టెంబర్ 14 వరకే ఈ పథకం అమలులో ఉంటుందని ఎస్బీఐ పేర్కొంది.

ఇందులో భాగంగా మూడు విభాగాలుగా డిపాజిట్లను విభజించింది. 75 రోజులు, 75 వారాలు (525 రోజులు), 75 నెలల (2,250 రోజులు) కాలపరిమితితో వాటిని తీసుకొచ్చింది. పథకంలో భాగంగా వడ్డీ రేట్లను 0.15 శాతం వరకు పెంచింది. 75 రోజుల కాలపరిమితికి ఇప్పటిదాకా 3.9 శాతం వడ్డీని ఇస్తుండగా.. కొత్త పథకంలో భాగంగా 0.05 శాతం పెంచి 3.95 వడ్డీని ఇవ్వనుంది. అలాగే 75 వారాల స్కీమ్ లో భాగంగా ఇప్పుడున్న 5 శాతం వడ్డీని 5.1 శాతానికి పెంచింది. 75 నెలల స్కీమ్ వడ్డీని 5.4 నుంచి 5.55 శాతానికి పెంచింది.

వృద్ధుల కోసం 75 రోజుల స్కీమ్ లో 4.45 శాతం వడ్డీని పొందనున్నారు. ఇంతకుముందు అది 4.4 శాతంగా ఉంది. 75 వారాలకు సంబంధించి 5.6 శాతం వడ్డీ రానుంది. అంతకుముందు 5.45 శాతంగా ఉంది. అయితే, 75 నెలల స్కీమ్ కు సంబంధించి వడ్డీని మాత్రం పెంచలేదు. ఈ ఆఫర్ ను కేవలం టర్మ్ డిపాజిట్లు, స్పెషల్ టర్మ్ డిపాజిట్లకే పరిమితం చేశారు. రూ.2 కోట్ల లోపు డిపాజిట్ చేసేందుకు వెసులుబాటు కల్పించారు.