రమ్య కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేశ్.. తీవ్ర ఉద్రిక్తత

16-08-2021 Mon 13:11
  • గుంటూరులో దారుణ హత్యకు గురైన రమ్య
  • మృతదేహానికి నివాళి అర్పించిన నారా లోకేశ్
  • పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట
Nara Lokesh pays tribute to Ramya
బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న దళిత విద్యార్థిని రమ్యను ఓ యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులోని కాకాని రోడ్డులో నిన్న ఈ దారుణం సంభవించింది. ఈ ఘటన ఏపీలో కలకలం రేపింది. రమ్య కుటుంబాన్ని టీడీపీ నేత నారా లోకేశ్ ఈరోజు పరామర్శించారు. వారి ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా అక్కడకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. అనంతరం పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.