Mynampally Hanumantha Rao: ఎమ్మెల్యే మైనంపల్లి ఇంటివద్ద ఉద్రిక్తత.. కోడిగుడ్లతో దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం

  • బండి సంజయ్ ని నిన్న దుర్భాషలాడిన మైనంపల్లి
  • ఈరోజు మల్కాజ్ గిరి బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ
  • ఆందోళనకు దిగిన మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
BJP workers protest at TRS MLA Mynampally residence

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. బీజేపీ కార్పొరేటర్ పై నిన్న దాడి జరిగిన సంగతి సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ శ్రేణులు జరిపిన ఈ దాడుల్లో కార్పొరేటర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ కార్పొరేటర్ ను ఆసుపత్రికి వెళ్లి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, మైనంపల్లిని కబ్జాకోరుగా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై మైనంపల్లి మండిపడ్డారు. మీడియా సమక్షంలోనే బండి సంజయ్ పై అభ్యంతరకర పదజాలంతో దూషించారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ మల్కాజ్ గిరి బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో మైనంపల్లి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆయన ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేసేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. ఆందోళనకు దిగిన మహిళా నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు. దీంతో అరెస్టైన మహిళలను విడుదల చేయాలంటూ బీజేపీ శ్రేణులు పీఎస్ ఎదుట ఆందోళన చేపట్టాయి. మరోవైపు మల్కాజ్ గిరిలోని అన్ని చౌరస్తాల్లోనూ పోలీసులు బందోబస్తును పటిష్ఠం చేశారు. ఇదిలావుంచితే, నిన్నటి దాడి ఘటనలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News