Afghanistan: అధ్యక్ష భవనంలో తాలిబన్ల రాజభోగాలు.. వేలాది ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదుల విడుదల.. వీడియోలు ఇవిగో!

  • బగ్రాం ఎయిర్ బేస్ జైళ్లలో ఉగ్రవాదులు
  • 5 వేల మందిని విడుదల చేసిన తాలిబన్లు
  • అధ్యక్ష భవనంలో రాజభోగాలు
Talibans Release 5000 Islamic State Terrorists

ఆఫ్ఘనిస్థాన్ లో అధికారం హస్తగతం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు దర్జా అనుభవిస్తున్నారు. ఆ దేశాధ్యక్ష అధికారిక భవనంలో రాజభోగాలను చవిచూస్తున్నారు. పంచభక్ష్యాలతో విందులు చేసుకుంటున్నారు. వాళ్లు భోగాలను అనుభవిస్తూనే.. ప్రపంచానికి పెనుముప్పులా పరిణమించిన ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు.

అమెరికాకు ఆఫ్ఘనిస్థాన్ లో అతిపెద్ద ఎయిర్ బేస్ (వైమానిక స్థావరం) అయిన బగ్రాం ఎయిర్ బేస్ నుంచి వేలాది మంది ప్రమాదకర ఉగ్రవాదులను విడుదల చేశారు. అక్కడ అమెరికా, ఆఫ్ఘన్ సైన్యం బంధించిన అతి భయంకరమైన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్), అల్ ఖాయిదా, తాలిబన్, ఇతర ముఠాలకు చెందిన 5 వేల మంది ఉగ్రవాదులను తాలిబన్లు విడిచిపెట్టారు. బగ్రాం జిల్లా చీఫ్ దర్వాయిస్ రౌఫీ ఈ విషయాన్ని వెల్లడించారు.

భారత మాజీ సైనికాధికారి, బీజేపీ నేత మేజర్ సురేంద్ర పూనియా వాటికి సంబంధించిన రెండు వీడియోలను పోస్ట్ చేశారు. అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన ఉగ్రవాదులను కాబూల్ జైళ్ల నుంచి తాలిబన్లు విడిచిపెట్టారంటూ ఆయన పోస్ట్ పెట్టారు. ఇక నుంచి ప్రపంచానికి ‘ఉగ్ర సంగీతమే’నంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

More Telugu News