తాలిబన్లు సౌండ్ పార్టీనే.. కళ్లు చెదిరే వారి ఆదాయ మార్గాలు ఇవే!

16-08-2021 Mon 11:23
  • గత వార్షిక బడ్జెట్ రూ. 11,829 కోట్లు
  • మూడేళ్లలో 400 శాతం పెరిగిన ఆదాయం
  • మైనింగ్, మాదకద్రవ్యాల ద్వారానే ఎక్కువ ఆదాయం
Afghanistan Talibans income sources
ఆఫ్ఘనిస్థాన్ మళ్లీ తాలిబన్ల వశమైంది. అమెరికా బలగాలు ఆఫ్ఘన్ ను వదిలి వెళ్లిన రోజుల వ్యవధిలోనే యావత్ దేశాన్ని తాలిబన్ ముష్కరులు కైవసం చేసుకున్నారు. రాజీనామా చేసిన ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ... ఆయన భార్య, ఆర్మీ చీఫ్, దేశ భద్రతా సలహాదారులతో కలిసి దేశాన్ని వదిలి వెళ్లిపోయారు.

అయితే, ఆయన ఎక్కడకు వెళ్లారనే విషయంలో మాత్రం పూర్తి స్పష్టత లేదు. ఆయన తజకిస్థాన్ కు వెళ్లినట్టు తొలుత వార్తలు వచ్చాయి. మరోవైపు ఉజ్బెకిస్థాన్ లోని తాష్కెంట్ కు పారిపోయారని ప్రముఖ వార్తా సంస్థ అల్ జజీరా తెలిపింది. దేశంలో రక్తపాతాన్ని నివారించేందుకే తాను కాబూల్ ను వీడుతున్నానని ఫేస్ బుక్ లో ఆఫ్ఘన్ పౌరులను ఉద్దేశించి ఘనీ ఓ పోస్ట్ చేశారు.

ఇంకోవైపు ఆఫ్ఘన్ ను మళ్లీ చేజిక్కించుకోవడానికి తాలిబన్లకు రెండు దశాబ్దాల కాలం పట్టింది. అగ్రరాజ్యం అమెరికా శిక్షణలో ఆరితేరిన ఆఫ్ఘన్ సేనలను ఓడించేందుకు తాలిబన్లు రెండు దశాబ్దాల పాటు పోరాడుతూనే ఉన్నారు. దేశంలో అధికారంలో లేకపోయినా రెండు దశాబ్దాల పాటు పోరాడే శక్తి, ఆర్థిక బలం వారికి ఎలా వచ్చాయనే అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది.

ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ సంస్థ ప్రపంచంలోని టాప్-10 ఉగ్రవాద సంస్థల్లో ఒకటి. అత్యంత సంపన్నమైన ఉగ్రసంస్థల్లో ఐదో స్థానంలో ఉంది. 2016లో ఫోర్బ్స్ మేగజీన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అప్పట్లో రూ. 14,800 కోట్ల వార్షిక టర్నోవర్ తో ఐసిస్ మొదటి స్థానంలో నిలిచింది. రూ. 2,900 కోట్ల టర్నోవర్ తో తాలిబన్ సంస్థ ఐదో స్థానంలో ఉంది. మాదకద్రవ్యాల అక్రమ సరఫరా, మైనింగ్ వ్యాపారాల ద్వారానే వీరికి అధిక ఆదాయం సమకూరుతోంది.

మరోవైపు గత ఏడాది నాటో విడుదల చేసిన వివరాల ప్రకారం తాలిబన్ల వార్షిక బడ్జెట్ రూ. 11,829 కోట్లు. అంటే 2016 నాటి ఫోర్బ్స్ జాబితా కంటే తాలిబన్ల టర్నోవర్ దాదాపు 400 శాతం పెరిగింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్ వార్షిక బడ్జెట్ రూ. 40 వేల కోట్లు కాగా... సైన్యానికి చేసిన కేటాయింపులు రూ. 800 కోట్లు మాత్రమే.

2019-20లో తాలిబన్ల ఆదాయం, ఆదాయ వనరుల వివరాలు:
  • మొత్తం ఆదాయం - రూ. 11,829 కోట్లు
  • మైనింగ్ ద్వారా - 3,400 కోట్లు
  • మాదకద్రవ్యాలు - రూ. 3,087 కోట్లు
  • విదేశీ విరాళాలు - 1,781 కోట్లు
  • విదేశీ ఎగుమతులు - రూ. 1,781 కోట్లు
  • పన్నులు - రూ. 1,187 కోట్లు
  • రియలెస్టేట్ ద్వారా - రూ. 593 కోట్లు.