ఇల్లు వదిలి వెళ్తావా.. అత్యాచారం చేయించమంటావా?: కుమార్తెను బెదిరించిన తండ్రి

16-08-2021 Mon 10:03
  • బంజారాహిల్స్‌లో ఘటన
  • శనివారం ఇంటికొచ్చి భార్య, బిడ్డలపై దాడి
  •  తన తల్లి పేరిట ఉన్న ఆస్తికి సంబంధించి అద్దెలు వసూలు చేసుకుంటున్నాడని ఆరోపణ
Father warns daughter to be raped by another person
అత్యాచారం చేయిస్తానంటూ కన్నతండ్రే కుమార్తెను బెదిరించిన ఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎంఫిల్ చదువుతున్న విద్యార్థిని తల్లి, తండ్రి, సోదరుడితో కలిసి రోడ్‌ నంబరు 10లో నివసిస్తోంది. అయితే, భార్యతో విభేదాల కారణంగా ఇల్లు ఖాళీ చేయాలంటూ భార్య, కుమార్తెలను గత కొంతకాలంగా విద్యార్థిని తండ్రి బెదిరిస్తున్నాడు.

ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చిన ఆయన వారిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తల్లి పేరిట ఉన్న ఆస్తికి సంబంధించి అద్దెలు వసూలు చేసుకోవడమే కాకుండా తమపై దాడికి దిగుతున్నాడని తండ్రిపై బాధిత విద్యార్థిని ఫిర్యాదు చేసింది. ప్రశ్నించినందుకు తనపై అత్యాచారం చేయిస్తానని బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.