ప్రియుడు చనిపోవడంతో ప్రియురాలి ఆత్మహత్య... ఇద్దరిని ఒకే ప్రదేశంలో ఖననం చేసిన కుటుంబ సభ్యులు

15-08-2021 Sun 22:18
  • గుంటూరు జిల్లాలో ఘటన
  • ప్రేమించుకున్న శ్రీకాంత్, సౌమ్య
  • విద్యుదాఘాతంతో శ్రీకాంత్ మృతి
  • విష గుళికలు మింగిన సౌమ్య
  • గ్రామంలో విషాదఛాయలు
Tragic love story in Guntur district
గుంటూరు జిల్లా ఉండ్రాళ్ల మండలం యల్లాయపాలెంలో విషాదం చోటుచేసుకుంది. కొన్నిరోజుల వ్యవధిలోనే ప్రేమికుల జంట కన్నుమూసింది. ప్రియుడు ప్రమాదవశాత్తు మరణించగా, ఆ బాధ భరించలేక ప్రియురాలు విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాంత్ (21), సౌమ్య (19) కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒక్కటవ్వాలని నిర్ణయించుకోగా, కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.

సాధారణంగా యువతీయువకుల్లో ప్రేమను ఇరుకుటుంబాల వారూ అంగీకరించడం చాలా అరుదైన విషయం. దాంతో తమ ప్రేమ పండిందని శ్రీకాంత్, సౌమ్య సంబరపడిపోయారు. అయితే, ఓ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ డెకరేషన్ కోసం వెళ్లిన శ్రీకాంత్ విద్యుదాఘాతంతో మరణించాడు. దాంతో సౌమ్యకు గుండె పగిలినట్టయింది. ప్రియుడి మృతిని జీర్ణించుకోలేక ఆమె విష గుళికలు మింగింది.

ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ప్రాణాలు విడిచింది. దాంతో వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరినీ ఒకే చోట ఖననం చేశారు. ప్రేమికులు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.