సర్కారు వారి పాట, పుష్ప చిత్రాల కంటెట్ లీక్ అవడం పట్ల మైత్రీ మూవీ మేకర్స్ స్పందన

15-08-2021 Sun 16:12
  • సర్కారు వారి పాట, పుష్ప చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ సంస్థ
  • కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ అయిందని వెల్లడి
  • సైబర్ పోలీసులకు ఫిర్యాదు
  • లీక్ అయిన కంటెంట్ ను ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి
Mythri Movie Makers gets anger and content leakage
టాలీవుడ్ లో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం మహేశ్ బాబుతో సర్కారు వారి పాట, అల్లు అర్జున్ తో పుష్ప చిత్రాలను ఏకకాలంలో నిర్మిస్తోంది. అయితే ఇటీవల ఈ రెండు చిత్రాల కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం పట్ల మైతీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. "మా చిత్రాలకు సంబంధించిన కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశాం" అని తెలిపింది.

కొందరు ప్రబుద్ధులు తమ కంటెంట్ ను లీక్ చేయడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతున్నారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ తరహా ధోరణితో తమను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ప్రేక్షకులకు అందాల్సిన థ్రిల్ ను చంపేస్తున్నారని వివరించింది. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని మైత్రీ మూవీ మేకర్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పేర్కొంది.

ఈ అంశాన్ని సైబర్ క్రైమ్ విభాగం దృష్టికి తీసుకెళ్లామని, నిందితులపై కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారని వెల్లడించింది. ఇలాంటి పైరసీ కంటెంట్ ను ప్రోత్సహించవద్దని ప్రేక్షకులకు సవినయంగా మనవి చేస్తున్నామని తెలిపింది.