రమ్య హత్య విషయం తెలియగానే సీఎం జగన్ చలించిపోయారు: హోంమంత్రి సుచరిత

15-08-2021 Sun 15:49
  • గుంటూరులో ప్రేమోన్మాది కలకలం
  • బీటెక్ విద్యార్థిని హత్య
  • ప్రేమను నిరాకరించిందని కత్తిపోట్లు
  • మృతదేహాన్ని పరిశీలించిన హోంమంత్రి
Mekathoti Sucharitha responds Btech student Ramya murder
గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో రమ్య మృతదేహాన్ని పరిశీలించారు. బీటెక్ విద్యార్థిని రమ్య హత్య ఘటన ఎంతో బాధాకరమని వ్యాఖ్యానించారు. రమ్య హత్య ఘటన గురించి సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారని, ఆయన చలించిపోయారని హోంమంత్రి వెల్లడించారు.

యువతిని హత్య చేసే హక్కు ఎవరిచ్చారని ఆమె ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తికి కచ్చితంగా కఠిన శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ఈ హత్యకు సంబంధించి పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారని, హంతకుడి కోసం గాలింపు జరుగుతోందని చెప్పారు.