High Court: సరదా కోసం శారీరక సంబంధాలకు దిగజారే స్థితికి మనదేశ యువతులు ఇంకా చేరుకోలేదు: మధ్యప్రదేశ్ హైకోర్టు

  • ఉజ్జయినిలో ఘటన
  • పెళ్లి పేరిట యువతిని మోసం చేసిన యువకుడు
  • ఆత్మహత్యకు యత్నించిన అమ్మాయి
  • యువకుడిపై కేసు నమోదు
Madhya Pradesh high court comments on pre marital affair

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ఓ యువకుడు, యువతిల మధ్య శారీరక సంబంధం విషయంలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ యువకుడు పెళ్లి పేరిట యువతితో శారీరక సంబంధం పెట్టుకోగా, ఆపై వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో వివాదం మొదలైంది. 2018లో ఇది జరిగింది.

వారిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవాళ్లు. తమ ఇంట్లో పెద్దవాళ్లు ప్రేమకు ఒప్పుకోవడంలేదని, అందుకే మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నానని ఆ యువకుడు చెప్పడంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. విషమ పరిస్థితుల నడుమ చికిత్స పొందగా, ఎట్టకేలకు ఆమె బతికి బయటపడింది. ఆమె నుంచి పోలీసులు వాంగ్మూలం సేకరించి, యువకుడిపై అత్యాచార కేసు నమోదు చేశారు.

యువకుడు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ కేసును విచారించింది. ఆ అమ్మాయి మేజర్ అని, ఆమె ఇష్టంతోనే తన క్లయింటు శారీరక సంబంధం పెట్టుకున్నాడని యువకుడి తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఇండోర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ సుబోధ్ అభయంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు ఎవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని స్పష్టం చేశారు.

సంప్రదాయాలకు విలువ ఇచ్చే మన సమాజంలో అవివాహిత యువతులు ఇంత దిగజారే స్థితికి ఇంకా చేరుకోలేదని వ్యాఖ్యానించారు. పెళ్లి చేసుకుంటామనే బలమైన హామీపైన తప్పించి, ఇతరత్రా కారణాలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వారికేమీ సరదా కాదని పేర్కొన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తమ నిజాయతీ నిరూపించుకోవడానికి బాధితులు బలవన్మరణాలకు ప్రయత్నించాల్సిన అవసరంలేదని అన్నారు. అంతేకాకుండా, శారీరక సంబంధాల పర్యవసానాలను కూడా పురుషులు దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికారు. ఆపై, నిందితుడికి బెయిల్ నిరాకరిస్తున్నట్టు జస్టిస్ సుబోధ్ అభయంకర్ స్పష్టం చేశారు.

More Telugu News