ప‌లువురు సినీ న‌టుల‌తో క‌లిసి బీజేపీలో చేరిన కరాటే క‌ల్యాణి.. టీఆర్ఎస్‌పై విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు

15-08-2021 Sun 13:12
  • బండి సంజయ్ సమక్షంలో ప‌లువురి చేరిక‌
  • తెలంగాణలో పాల‌న‌ రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందన్న విజ‌య‌శాంతి
  • తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య
karate kalyani joins in bjp
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో సినీ న‌టి కరాటే కల్యాణి, ఇత‌ర సినీన‌టులు కొంద‌రు ఈ రోజు బీజేపీలో చేరారు. అలాగే, జల్పల్లి కౌన్సిలర్ యాదయ్యతో పాటు ప‌లు పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరారు. వారంద‌రినీ రాష్ట్ర బీజేపీ నాయ‌కులు పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ నాయ‌కురాలు విజయశాంతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పాల‌న‌ రాక్షసుల చేతుల్లోకి వెళ్లిందని మండిప‌డ్డారు. తెలంగాణ బీజేపీ చేతుల్లోకి వెళితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. బీజేపీలో ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా వంటి ఎందరో సమర్థ‌వంత‌మైన నేత‌లు ఉన్నార‌ని చెప్పారు.
 
తెలంగాణ‌లో సంజయ్ వంటి నేత ఉన్నార‌ని ఆమె చెప్పారు. రాష్ట్ర‌ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు ఆయ‌న‌  పాదయాత్ర చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. ఆయ‌న‌ పాదయాత్ర విజ‌య‌వంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు.