స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాట రాసిన బెంగాల్​ సీఎం మమత

15-08-2021 Sun 13:07
  • ఈ దేశం మనందరిదీ అంటూ సాగే గేయం
  • పాట పాడిన వారి పేర్లు వెల్లడి
  • స్వాతంత్ర్యాన్ని లాక్కునే వారిపై గళం విప్పాలని పిలుపు
Bengal CM Mamata Penned A Song On Independence Day
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట రాశారు. ‘ఈ దేశం మనందరిదీ’ అంటూ సాగే ఆ పాటను ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. బెంగాలీ గాయకులు ఇంద్రనీల్ సేన్, మనోమయ్ భట్టాచార్య, త్రిష పరూయి, దేవజ్యోతి ఘోష్ లు తాను రాసిన ఆ పాటను పాడినట్టు పేర్కొన్నారు.

మన స్వాతంత్ర్యాన్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్న అన్ని దుష్ట శక్తులపై పోరాడేందుకు గళాన్ని వినిపించాల్సిన అవసరం ఉందని ఆమె ఈరోజు ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణత్యాగాలను చేసిన మహనీయులను ఎన్నటికీ మరిచిపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, కోల్ కతా విక్టోరియా మెమోరియల్ ను 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 7,500 చదరపుటడుగుల త్రివర్ణ పతాకంతో ముస్తాబు చేశారు. ఆ జెండాను బెంగాల్ గవర్నర్ జగ్ దీప్ ధన్ కర్ ఆవిష్కరించారు. హిమాలయ మౌంటెనీరింగ్ ఇనిస్టిట్యూట్ ఈ భారీ పతాకాన్ని రూపొందించింది.