CJI: చట్టాలు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియట్లేదు?: పార్లమెంట్​ సమావేశాలపై సీజేఐ ఎన్వీ రమణ విచారం

Sorry State Of Parliament Affairs Says CJI NV Ramana
  • లోపాల మయంగా మారుతున్న చట్టాలు
  • వాటిని అడ్డుకునే అధికారమూ మాకు లేదు
  • న్యాయవాదులూ ప్రజాసేవకు ముందుకురావాలి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. చట్టాలను సరిగ్గా తయారు చేయడం లేదని, వాటిపై సరైన చర్చలూ జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఇది అత్యంత దారుణమైన విషయమని అన్నారు. నేటి ప్రభుత్వాలు చేస్తున్న చట్టాల్లో ఎన్నెన్నో లోపాలుంటున్నాయని, దాని వల్ల ప్రజలు, కోర్టులు, ఇతర భాగస్వాములకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. సుప్రీంకోర్టులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.

చట్టాల రూపకల్పనలో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు చట్టాలను తయారు చేసే ఉద్దేశమేంటో కూడా తెలియడం లేదన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమం నుంచి దేశ తొలి చట్టసభ ప్రతినిధుల దాకా న్యాయవాదులు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. ఆనాడు చట్టసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారన్న ఆయన.. సభలో చర్చలు అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా సాగేవని చెప్పారు. తీసుకురాబోయే చట్టాలపై సవివరాలతో చర్చ జరిగేదన్నారు.

అయితే, కాలం మారుతున్న కొద్దీ అది మొత్తం మారిపోయిందన్నారు. చర్చల్లో పస ఉండడం లేదని, అసలు ఆ చట్టాల ఉద్దేశం కోర్టులకూ తెలియడం లేదని, వాటికి అభ్యంతరం చెప్పే అధికారమూ కోర్టులకు లేకుండా పోయిందని చెప్పారు. కాబట్టి ఇక నుంచి న్యాయవాదులంతా ఇళ్లకే పరిమితం కాకుండా ప్రజాసేవకూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ వంటి మహామహులు న్యాయవాదులేనని సీజేఐ రమణ గుర్తు చేశారు.
CJI
Chief Justice Of India
Supreme Court
NV Ramana

More Telugu News