Prime Minister: ‘పీఎం గతి శక్తి’..100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రూ.100 లక్షల కోట్ల భారత్​: ప్రధాని నరేంద్ర మోదీ

  • యువతకు ఉపాధి పెరుగుతుందని హామీ
  • ‘అందరి శ్రమ’ కావాలని పిలుపు
  • బాలికలకు సైనిక్ స్కూళ్లలో ‘సగం కోటా’
  • గ్రామీణ ప్రాంతాల్లో ‘100%’ అభివృద్ధి
Narendra Modi Announces PM Gati Shakti Scheme For 100 lakh Crore Bharath

భారతదేశాన్ని రాబోయే 25 ఏళ్లలో ప్రగతి పథంలో నడిపిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవం నాటికి రూ.100 లక్షల కోట్ల భారత్ గా మారుస్తామని చెప్పారు. ఆ లక్ష్యాన్ని చేరేందుకు ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ చాలా కీలకమని చెప్పుకొచ్చారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇవాళ ఆయన ఎర్రకోట వద్ద జెండాను ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన దేశాభివృద్ధి కోసం త్వరలోనే ‘పీఎం గతి శక్తి’ పథకాన్ని ప్రారంభించబోతున్నామని ప్రకటించారు. అందులో భాగంగా దేశంలో మౌలిక వసతులను మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. అత్యాధునిక మౌలిక వసతులను కల్పించి దేశాన్ని రూ.100 లక్షల కోట్ల శక్తిగా మారుస్తామన్నారు. గతి శక్తి కార్యక్రమంలో భాగంగా దేశీయ ఉత్పత్తిదారులకు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామన్నారు.

అంతేగాకుండా భవిష్యత్ లో కొత్త ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు బాటలు పరుస్తామన్నారు. గతి శక్తి పథకంతో యువతకు ఉపాధి పెరుగుతుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఏడేళ్ల క్రితం భారత్ 800 కోట్ల డాలర్ల విలువైన ఫోన్లను దిగుమతి చేసుకునేదని, కానీ, ఇప్పుడు 300 కోట్ల డాలర్ల విలువైన ఫోన్లను మనమే ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు.

అత్యాధునికమైన నూతన సాంకేతికతను వాడుకుంటూ మౌలిక వసతులను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుందని పిలుపునిచ్చారు. అమృత ఘడియలకు మరో 25 ఏళ్ల సమయం ఉందని, ఆ సమయం కోసం ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ ప్రయత్నాలను ప్రారంభించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనే నాటికి ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేసుకోవాలన్నారు.

 దేశంలోని ఆడబిడ్డలకు సమాన అవకాశాలు కల్పిస్తామన్న ఆయన.. ఇక నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక్ స్కూళ్లు, ఆర్మీ స్కూళ్లలో సగం కోటా బాలికలకు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలు, నగరాల మధ్య ఉన్న అంతరాలను తగ్గించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాలన్నింటికీ 100 శాతం రోడ్లు, 100 శాతం ఇళ్లు, 100 శాతం ఆయుష్మాన్ భారత్ కార్డులు, 100 శాతం గ్యాస్ కనెక్షన్లను ఇస్తామన్నారు. పోషకాహార లోపంతో పిల్లలు ఎదగట్లేదన్న ఆయన.. వారి కోసం అందించే మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే బియ్యాన్ని మరింత పెంచుతామని, మంచి బియ్యం ఇస్తామని చెప్పారు.

సన్నకారు రైతుల సామర్థ్యాన్ని పెంచేందుకు 70 మార్గాల్లో కిసాన్ రైళ్లను నడుపుతున్నామన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75 వారాల్లో 75 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాల రాజధానులకు త్వరలోనే రైలు మార్గాలను వేస్తామన్నారు. దేశంలో 4.5 కోట్ల ఇళ్లకు జల్ జీవన్ మిషన్ కింద నల్లా కనెక్షన్ ఇచ్చామన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం 75 వేల వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పామని చెప్పారు.

More Telugu News