మీరిచ్చే రూ. 5 వేలు సరిపోక అప్పులు చేశా, వాటిని తీర్చండి.. సీఎం జగన్‌కు వలంటీరు రాసిన లేఖ వైరల్

15-08-2021 Sun 10:09
  • అప్పుల బాధ తాళలేక వలంటీరు ఆత్మహత్య
  • అంతకుముందు రాసిన లేఖ సోషల్ మీడియాలోకి
  • అక్కల వివాహాల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు
  • లేఖలో అప్పు ఇచ్చిన వారి వివరాలు.. ఫోన్ నంబర్లు
AP Volunteer letter viral In social media
తాను చేసిన అప్పులు ముఖ్యమంత్రి జగన్ తీర్చాలంటూ ఓ వలంటీరు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గం తొమ్మిదో వార్డు వలంటీరు మహేష్ (ఉమేష్) ఈ లేఖ రాసినట్టు తెలుస్తోంది. ఈ నెల 11న అతడు ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. ఉమేష్ చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. దీంతో  నలుగురు అక్కాచెల్లెళ్ల బాధ్యతను తనపై వేసుకున్న ఉమేష్ వారికి వివాహాలు కూడా చేశాడు. ఇందుకోసం రూ. 3 లక్షల వరకు అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అప్పట్లో తెలిపారు.

ఆత్మహత్యకు ముందు ఉమేష్ రాసినట్టుగా చెబుతున్న లేఖ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారంలో మూడు రోజులు పనిచేస్తే సరిపోతుందని చెప్పి తనను విధుల్లోకి తీసుకున్నారని, కానీ రాత్రీపగలు పనిచేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సీఎం జగన్ తెలుసుకోవాలని, జీతాల గురించి ఆలోచించాలని కోరాడు. ప్రభుత్వం ఇచ్చే రూ. 5 వేలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, తాను చేసిన అప్పులను సీఎం జగన్ తీర్చాలని వేడుకున్నాడు.

గతంలో తనకు మంజూరైన ఇంటి స్థలాన్ని తన అక్కకు ఇవ్వాలని, తమకు అప్పులిచ్చిన వారు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరాడు. ఈ క్రమంలో తాను ఎవరెవరి వద్ద ఎంతెంత మొత్తం అప్పుగా తీసుకున్నదీ లేఖలో పేర్కొంటూ వారి ఫోన్ నంబర్లను కూడా రాశాడు. కాగా, వైరల్ అవుతున్న ఈ లేఖపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నట్టు మునిసిపల్ కమిషనర్ జబ్బార్ మియా తెలిపారు.