కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై కీలక నిర్ణయం.. తన కోసం జీరో ట్రాఫిక్ వ్యవస్థ వద్దని ఆదేశాలు

15-08-2021 Sun 08:36
  • జనం ఇబ్బందులపై సీఎం స్పందన
  • సిగ్నల్ ఫ్రీ మాత్రమే కొనసాగించాలని ఆదేశం
  • సీఎం నిర్ణయంపై నగర ప్రజల హర్షం
Karnataka Chief Minister Does Not Want Zero Traffic Rule For Himself
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కోసం జీరో ట్రాఫిక్ వ్యవస్థను కల్పించవద్దని, సిగ్నల్ ఫ్రీ మాత్రమే కొనసాగించాలని సూచించారు. బెంగళూరుకు అంతర్జాతీయ ఖ్యాతి ఉండడంతో నిత్యం నేతల రాకపోకలతో నగరం బిజీగా ఉంటోంది. వారు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్‌ గంటలకొద్దీ నిలిపివేస్తుండడంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో స్పందించిన సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర స్థాయిలో సీఎం, హోం మంత్రికి జీరో ట్రాఫిక్  వ్యవస్థ కల్పిస్తున్నారు. అయితే, ఇకపై ఇది వద్దని, సిగ్నల్ ఫ్రీ మార్గాన్ని మాత్రమే కొనసాగించాలంటూ పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్) రవికాంతేగౌడకు ఆదేశాలు జారీ చేశారు. తాను ప్రయాణించే మార్గం వివరాలను ముందుగానే అందిస్తానని, ఆ సమయంలో ఆ మార్గంలో ట్రాఫిక్ రద్దీ లేకుండా చూస్తే చాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగా, సీఎం నిర్ణయంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.