భీమవరం పేలుళ్ల వెనక ఎవరున్నారు?.. అంతుచిక్కని మిస్టరీ!

15-08-2021 Sun 07:44
  • జగన్ పర్యటనకు ముందు రెండు పేలుళ్లు
  • ఉలిక్కిపడిన భీమవరం
  • గాయపడిన గోవు చికిత్స పొందుతూ మృతి
  • పరీక్ష కోసం పేలుడు నమూనాలు
Mystery on Bhimavaram bomb blasts
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం పర్యటనకు ముందు జరిగిన వరుస పేలుళ్ల మిస్టరీ వీడడం లేదు. ఈ పేలుళ్ల వెనక ఎవరైనా ఉన్నారా? లేక ప్రమాదవశాత్తు పేలుళ్లు సంభవించాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. జగన్ పాల్గొనే కార్యక్రమ వేదికకు సమీపంలో శుక్రవారం సాయంత్రం భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ ఆవు కాలు తెగిపడడంతో పాటు దాని పొట్టలో తీవ్ర గాయమైంది. చికిత్స పొందుతూ నిన్న మరణించింది.

పేలుడుతో ఉలిక్కిపడిన పోలీసులు సమీపంలోని నివాసాలు, దుకాణాల వద్ద ఉన్న సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో పాత ఇనుప సామాన్లు కొనుగోలు చేసే దుకాణం ఉంది. కాబట్టి పాత ఫ్రిజ్, ఏసీల్లోని కంప్రెషర్ల వల్ల పేలుడు సంభవించి ఉండే అవకాశం ఉందని తొలుత భావించారు. అయితే, ఈ ఘటన జరిగిన మరికొన్ని గంటలకే లంకపేట, దుర్గాపురం ప్రాంతాల్లో మరో పేలుడు సంభవించింది.

లారీ ట్యాంకరుకు వెల్డింగ్ చేస్తుండగా అందులో అడుగున ఉన్న రసాయనానికి నిప్పు రవ్వలు తగలడంతో భారీ పేలుడు సంభవించింది. ట్యాకరు వెనక భాగం అమాంతం ఎగిరిపడింది. ఇనుప రేకులు విద్యుత్ తీగలపై పడడంతో ఆ ప్రాంతంలో సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న డీఐజీ కేవీ మోహనరావు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఘటన స్థలాల నుంచి  సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు పంపించారు.