Pawan Kalyan: నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశం ఆవిష్కృతం కావాలి: పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes the countrymen on independence day
  • స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • భారతావనికి మధురఘట్టం అని వెల్లడి
  • త్యాగధనులకు నీరాజనాలు
  • సుసంపన్న భారత్ కోసం ఆకాంక్ష
భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న వేళ దేశ ప్రజలకు జనసేనాని పవన్ కల్యాణ్ వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్న భారత్ ఆవిష్కృతం కావాలి అంటూ తన మనోభావాలను ఓ ప్రకటన రూపంలో పంచుకున్నారు. వజ్రోత్సవ స్వాతంత్ర్య వేడుక భారతావనికి ఓ మధురమైన ఘట్టం అని వెల్లడించారు. శతాబ్దాల పోరాట ఫలితం అని, భారతావనికి ఇది మధురమైన ఘట్టం అని వివరించారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ వారికి నీరాజనాలు అర్పిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు.

"ఎన్నో అవాంతరాలు, మరెన్నో విలయాలను అధిగమిస్తూ ఎందరో మేధావులు, రాజనీతిజ్ఞులు, కవులు, కళాకారులు, కోట్లాది మంది కార్మిక కర్షకులను భారత్ ఈ ప్రపంచానికి అందిస్తూనే ఉంది. శతవార్షిక స్వాతంత్ర్య దినోత్సవం నాటికి నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశంగా భారత్ రూపుదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. నా తరఫున, జనసేన తరఫున భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.
Pawan Kalyan
Independence Day
India
Janasena

More Telugu News