"జెండా ఎగరేస్తాం"... సింగిల్ లైన్ ట్వీట్ తో చర్చకు తెరలేపిన ప్రకాశ్ రాజ్

14-08-2021 Sat 19:38
  • వచ్చే నెలలో 'మా' అధ్యక్ష ఎన్నికలు
  • బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు తదితరులు
  • బలమైన పోటీదారుగా ఉన్న ప్రకాశ్ రాజ్
  • ఏకగ్రీవం కోసం పలువురి ప్రయత్నాలు
Prakash Raj latest tweet triggers discussion on MAA Elections
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం మరింత రాజుకుంది. మంచు విష్ణుకు 110 మంది సభ్యుల మద్దతు ఉందని టాలీవుడ్ సీనియర్ నటుడు మాణిక్ 'మా' క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాయడం తెలిసిందే. మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో 'మా' అధ్యక్ష రేసులో ప్రధాన పోటీదారుగా ఉన్న ప్రకాశ్ రాజ్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. "జెండా ఎగరేస్తాం" అంటూ సింగిల్ లైన్ తో ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేశారు. ఇప్పుడా ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

'మా' అధ్యక్ష ఎన్నికలకు సమరశంఖం పూరించారా? లేక, రేపటి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్య చేశారా? అనేది అస్పష్టంగా ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అయితే, జెండా ఎగరేస్తామని ఆయన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది 'మా' ఎన్నికలను ఉద్దేశించిన కామెంటేనని అభిమానులు పేర్కొంటున్నారు. ప్రకాశ్ రాజ్ ఇటీవల చెన్నైలో ఓ తమిళ చిత్రం షూటింగ్ లో గాయపడ్డారు. దాంతో హైదరాబాదులో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ గురవారెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నారు.