భారత ఒలింపిక్ బృందానికి రాష్ట్రపతి భవన్ లో ఆతిథ్యం.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో సమావేశం

14-08-2021 Sat 19:19
  • టోక్యో ఒలింపిక్స్ లో భారత్ 7 పతకాలు
  • గతంతో పోల్చితే మెరుగైన ప్రదర్శన
  • అథ్లెట్లకు రాష్ట్రపతిభవన్ లో తేనేటి విందు
  • అథ్లెట్లను అభినందించిన రాష్ట్రపతి
President Ramnath Kovind held High Tea with olympic contingent
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత బృందం గత రికార్డును మెరుగుపర్చుతూ 7 పతకాలతో తిరిగొచ్చింది. అందులో నీరజ్ చోప్రా సాధించిన అథ్లెటిక్ స్వర్ణం కూడా ఉంది. ఈ నేపథ్యంలో, భారత ఒలింపిక్ బృందంతో రాష్ట్రపతిభవన్ లో దేశ ప్రథమపౌరుడు రామ్ నాథ్ కోవింద్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో అథ్లెట్లకు తేనేటి విందు (హై టీ కార్యక్రమం) ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు.

రామ్ నాథ్ కోవింద్, వెంకయ్య భారత అథ్లెట్లను పరిచయం చేసుకుని వారితో ముచ్చటించారు. భారత ఒలింపియన్ల ప్రదర్శన పట్ల యావత్ భారతావని గర్విస్తోందని, దేశానికి వన్నె తెచ్చారని కోవింద్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో పతకాలు గెలిచిన నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, రవి దహియా, భజరంగ్ పునియా, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్, భారత పురుషుల హాకీ జట్టు సభ్యులు, అమోఘ ప్రదర్శన చేసిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు సహా ఇతర ఒలింపియన్లు పాల్గొన్నారు.