నెల్లూరు బాబా త్రిలోక్ నాథ్ రెడ్డి అక్రమాలు వెలికితీస్తున్న పోలీసులు

14-08-2021 Sat 18:58
  • హైదరాబాదులో రియల్టర్ హత్య
  • నిందితుల అరెస్ట్
  • నిందితుల్లో ఒకరు బాబాగా చెలామణి 
  • రియల్టర్ హత్యలో బాబా పాత్ర
Police investigates Triloknath Baba wrong doings
ఇటీవల రియల్టర్ విజయభాస్కర్ హత్యోదంతం వెలుగుచూడగా, నిందితుల్లో ఒకరైన త్రిలోక్ నాథ్ బాబా అక్రమాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. బాబా పూర్తిపేరు త్రిలోక్ నాథ్ రెడ్డి. స్వస్థలం నెల్లూరు. కొంతకాలంగా హైదరాబాదు, నిజాంపేటలో తల్లి, చెల్లితో కలిసి ఉంటున్నాడు. పూజల పేరుతో వందలమందిని బురిడీ కొట్టించినట్టు గుర్తించారు. ఆయుర్వేద చికిత్స పేరిట రాజకీయ నాయకులతో పాటు కొందరు అధికారులకు దగ్గరయ్యాడు.

మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్ తో కలిసి త్రిలోక్ నాథ్ బాబా అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. తన వ్యతిరేకులను మాజీ ఆర్మీ అధికారి మల్లేశ్ సాయంతో బెదిరించేవాడు. అతడికి సుధాకర్ అనే వ్యక్తి అత్యంత సన్నిహిత భక్తుడు. ఈ నేపథ్యంలో, సుధాకర్, మల్లేశ్ లతో కలిసి త్రిలోక్ నాథ్ బాబా అక్రమాలు, మోసాలకు తెరలేపాడు.

కాగా, సుధాకర్ భార్యపై రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ చేసిన వ్యాఖ్యలే ఈ హత్యకు దారితీసినట్టు భావిస్తున్నారు. పక్కా ప్లాన్ తో విజయభాస్కర్ ను సుధాకర్, మల్లేశ్ అంతమొందించారు. విజయభాస్కర్ మృతదేహాన్ని దహనం చేసేందుకు త్రిలోక్ నాథ్ బాబా డబ్బులు ఇచ్చాడు. వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణలో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.