ఎట్టకేలకు 9వ ప్రయత్నంలో అమ్ముడైన విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ హౌస్

14-08-2021 Sat 17:41
  • రుణాల ఎగవేతకు పాల్పడిన మాల్యా
  • బ్రిటన్ కు పారిపోయిన వైనం
  • భారత్ లో మాల్యా ఆస్తుల వేలం
  • కింగ్ ఫిషర్ హౌస్ ను కొనుగోలు చేసిన శాటర్న్ రియల్టర్స్
Kingfisher House sold in the ninth attempt
రుణాల ఎగవేతకు పాల్పడి బ్రిటన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఆస్తులను బ్యాంకుల కన్సార్టియం వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. బకాయిలను రాబట్టేందుకు బ్యాంకుల కన్సార్టియంకు చెందిన రుణ రికవరీ ట్రైబ్యునల్ ప్రయత్నిస్తోంది. అయితే, 2016 నుంచి వేలం వేస్తున్నప్పటికీ ఎవరూ కొనుగోలు చేసేందుకు ముందుకు రాని కింగ్ ఫిషర్ హౌస్ ఎట్టకేలకు అమ్ముడైంది. ముంబయిలోని విలేపార్లే ప్రాంతంలో ఉన్న కింగ్ ఫిషర్ హౌస్ ను హైదరాబాద్ కు చెందిన శాటర్న్ రియల్టర్స్ సంస్థ రూ.52.25 కోట్లకు కొనుగోలు చేసింది.

ఈ భవనాన్ని ఇప్పటివరకు 9 పర్యాయాలు వేలంలో ఉంచగా, ఇన్నాళ్లకు అమ్ముడైంది. గత ఎనిమిది పర్యాయాలు ఈ భవనం కనీస ధరను రూ.135 కోట్లుగా పేర్కొన్నారు. అయితే ఈసారి వేలంలో ఆ ధరను సడలించినట్టు తెలుస్తోంది. భవన సముదాయం మొత్తం విస్తీర్ణం 2401.70 చదరపు మీటర్లు.

ముంబయి ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉన్న ఈ కింగ్ ఫిషర్ హౌస్ ఒకప్పుడు మాల్యాకు చెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ప్రధాన కార్యాలయంగా వెలుగొందింది. మాల్యా పరారీ నేపథ్యంలో రుణ రికవరీ ట్రైబ్యునల్ ఈ భవనాన్ని కూడా వేలం వేసింది. మాల్యాపై రూ.9 వేల కోట్ల మేర ఎగవేత, మనీలాండరింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.