Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ ప్రజలపై యుద్ధం ప్రకటించడాన్ని నేను అంగీకరించను: దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ

I will not accept war on Afghan people says Ashraf Ghani
  • దేశం అస్థిరత్వ పరిస్థితుల్లో ఉంది
  • భద్రతాబలగాలను తిరిగి సమాయత్తం చేయడమే ప్రధాన అంశం
  • గత 20 ఏళ్లలో సాధించిన లక్ష్యాలను వదులుకోవడానికి సిద్ధంగా లేను
ఆఫ్ఘనిస్థాన్ ప్రస్తుతం దారుణమైన, అస్థిరత్వ పరిస్థితుల్లో ఉందని ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ దేశాన్ని కాపాడుకుంటామని, దీనికోసం అంతర్జాతీయ సమాజంతో చర్చలు జరుపుతామని అన్నారు. హింసను అడ్డుకోవడం, అస్థిరత్వాన్ని నివారించడంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించామని చెప్పారు. దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించడాన్ని తాను అంగీకరించలేనని అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సహించలేనని చెప్పారు. గత 20 ఏళ్లలో సాధించిన లక్ష్యాలను కోల్పోవడానికి సిద్ధంగా లేనని తెలిపారు.

భద్రతాబలగాలను, సెక్యూరిటీని తిరిగి సమాయత్తం చేయడమే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యమైన అంశమని ఘనీ చెప్పారు. దీనికోసం స్థానిక రాజకీయ నేతలతో పాటు, అంతర్జాతీయ సమాజంతో కూడా చర్చలు జరుపుతామని అన్నారు. దేశంలో శాంతిని నెలకొల్పడం కోసం శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు.

అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్లిపోయిన వెంటనే తాలిబన్లు రెచ్చిపోయారు. రక్తపుటేర్లు పారిస్తూ దురాక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే రెండొంతుల దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఆర్థిక రాజధాని కాందహార్ ని చేజిక్కించుకున్నారు. ఇప్పడు కాబూల్ ని చుట్టుముట్టారు. ఈ నేపథ్యంలో అష్రఫ్ ఘనీ రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలకు ముగింపు పలుకుతూ దేశం కోసం తాను పోరాడతానంటూ ఆయన ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పైవ్యాఖ్యలు చేశారు.
Afghanistan
Ashraf Ghani
Taliban

More Telugu News