మంచు విష్ణుకు 110 మంది సభ్యుల మద్దతు ఉంది: సీనియర్ నటుడు మాణిక్

14-08-2021 Sat 16:12
  • 'మా' అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలి
  • మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి
  • లేనిపక్షంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలి
Manchi Vishnu has 110 members support says Manik
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని అసోసియేషన్ సభ్యులు పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు విన్నవించారు. అసోసియేషన్ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కృష్ణంరాజుకు వారు లేఖ రాశారు. ఈ సందర్భంగా 'మా' వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ నటుడు మాణిక్ మాట్లాడుతూ 110 మంది సభ్యులతో కూడిన లేఖను కృష్ణంరాజుకు పంపించామని చెప్పారు.

ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ గురించి కొందరు సభ్యులు అసత్య ఆరోపణలు చేశారని... వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని మాణిక్ కోరారు. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న మంచు విష్ణుకు 110 మంది సభ్యుల మద్దతు ఉందని... అందువల్ల ఈ ఎన్నికల్లో విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కృష్ణంరాజును కోరుతున్నామని చెప్పారు. లేనిపక్షంలో ఎన్నికలను వెంటనే నిర్వహించాలని కోరారు.