అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందుతుంది: సీఎస్ సోమేశ్ కుమార్

14-08-2021 Sat 15:57
  • తెలంగాణలో దళిత బంధు
  • హుజూరాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు
  • ఈ నెల 16న ప్రారంభం
  • లబ్దిదారులకు చెక్కులు ఇవ్వనున్న సీఎం కేసీఆర్
 Telangana CS Somesh Kumar expalins Dalitha Bandhu project
సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేయనుండడం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకానికి లబ్దిదారుల జాబితా రూపొందించారు. అయితే తమకు దళిత బంధు ఎందుకివ్వరంటూ దళితులు నేడు హుజూరాబాద్ లో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ స్పందించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ దళిత బంధు అందుతుందని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. దళిత బంధు అద్భుతమైన పథకం అని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 16న హుజూరాబాద్ లో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కొందరు లబ్దిదారులకు స్వయంగా చెక్కులు అందిస్తారని సీఎస్ వివరించారు.

దళిత బంధు పథకాన్ని ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు మంత్రులు తన్నీరు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్ కూడా హుజూరాబాద్ లోనే ఉన్నారు.