Rajendra Prasad: సర్పంచ్ లు, ఎంపీటీసీలే జాతీయ జెండాను ఎగురవేయాలి: వైవీబీ రాజేంద్రప్రసాద్ డిమాండ్

Surpanches has to hoist national flag says Rajendra Prasad
  • విద్యాకమిటీ ఛైర్మన్లతో జెండా వందనం చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు
  • పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపాటు
  • ప్రభుత్వ ఆదేశాలు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి  విరుద్ధమని వ్యాఖ్య
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పాఠశాలల్లో విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా వందనం చేయించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీలతోనే జెండాను ఎగురవేయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమని అన్నారు. సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను నిర్వీర్యం చేసేలా వైసీపీ ప్రభుత్వం జీవోలను జారీ చేస్తోందని మండిపడ్డారు. ఈ జీవోను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు.
 
సర్పంచ్ లు, ఎంపీటీసీలకు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఆ నిబంధనలను పక్కన పెట్టి... విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా ఎగురవేయించాలని ఆదేశాలను జారీ చేయడం దారుణమని అన్నారు. సర్పంచ్ లకు వ్యతిరేకంగా నిధులు, విధులు, అధికారాలు తదితర అంశాల్లో చట్ట వ్యతిరేక జీవోలను జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు.
Rajendra Prasad
Telugudesam
Independence Day
Flag
Surpanches

More Telugu News