Randeep Guleria: వ్యాక్సిన్ నుంచి తప్పించుకునేందుకు కరోనా మహమ్మారి ప్రయత్నిస్తోంది: ఎయిమ్స్ చీఫ్ గులేరియా

  • గీతం సంస్థల 41వ వ్యవస్థాపక దినోత్సవం
  • హాజరైన ఎయిమ్స్ చీఫ్
  • గులేరియాకు గీతం ఫౌండేషన్ అవార్డు
  • ఏపీలో కరోనా కట్టడి బాగుందని కామెంట్  
AIIMS Chief Randeep Guleria attends GITAM Foundation Day in Vizag

విశాఖలో గీతం విద్యాసంస్థల 41వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హాజరయ్యారు. ఆయనను గీతం ఫౌండేషన్ అవార్డుతో సత్కరించారు.

ఈ సందర్భంగా గులేరియా మాట్లాడుతూ, దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీరుతెన్నులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందని వెల్లడించారు. వైరస్ రూపాంతరం చెందడం వెనుక ఉద్దేశం అదేనని వివరించారు.

కొవిడ్ మార్గదర్శకాలు పాటించడం, పాటించకపోవడం అనే అంశాలపైనే థర్డ్ వేవ్ రాక ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. మూడో దశలో చిన్నారులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది అని చెప్పేందుకు శాస్త్రీయ అధ్యయనం లేదని అన్నారు. అయితే, పిల్లలకు వ్యాక్సిన్ లేనందున వారు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఉండొచ్చని గులేరియా అభిప్రాయపడ్డారు.

ఇటీవల ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయని, అయితే ఏపీలో కరోనా కేసుల కట్టడి బాగుందని వ్యాఖ్యానించారు. ఒకచోట కరోనా విజృంభిస్తే వేరే చోట్ల కేసులు రాకుండా చూడాలని స్పష్టం చేశారు.

More Telugu News