రోహిత్​, రాహుల్​ పై ఇంగ్లండ్​ ఏస్​ బౌలర్​ ఆండర్సన్​ ఆసక్తికర కామెంట్లు

14-08-2021 Sat 15:06
  • మబ్బులున్నప్పుడు ఎలా ఆడాలో చూపించారు
  • మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టారు
  • ఫుల్ లెంగ్త్ బంతులు వేసేలా చేసి శిక్షించారు
Anderson Comments On Rohit and Rahul
టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ పై ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఆసక్తికర కామెంట్లు చేశాడు. వారి బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆకాశం మబ్బులుపట్టినప్పుడు, చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఎలా బ్యాటింగ్ చేయాలో నేర్పించారని అన్నాడు. తాము లెంగ్త్ మార్చుకుని బౌలింగ్ చేసేందుకు వారిద్దరూ తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకున్నారని చెప్పాడు. వారిద్దరూ చాలా అద్భుతంగా ఆడి.. తమను ఒత్తిడిలోకి నెట్టారన్నాడు. ఫుల్ లెంగ్త్ బంతులు వేసేలా చేసి.. వాటిని బౌండరీలకు తరలించారని పొగడ్తల్లో ముంచెత్తాడు.

లార్డ్స్ తనకెంతో ప్రత్యేకమని ఆండర్సన్ చెప్పాడు. ప్రతీసారి అక్కడ అదే చివరి మ్యాచ్ అనుకుంటూ వస్తానని అన్నాడు. ఈ మైదానం ఎప్పుడూ తనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసుకొస్తోందని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 127 పరుగులతో సత్తా చాటాడు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడి 84 పరుగులు చేశాడు. ఆండర్సన్ ఐదు వికెట్లు తీసి.. 1951 తర్వాత ఈ ఘనత సాధించిన పెద్ద వయసువాడిగా రికార్డు సృష్టించాడు.