వార్​ లార్డ్స్​, తాలిబన్ల హోరాహోరీ.. బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్న నగరం

14-08-2021 Sat 14:44
  • మజారీ షరీఫ్ ఆక్రమణకు వెళ్లిన ఉగ్రవాదులు
  • తుపాకులతోనే సమాధానమిచ్చిన వార్ లార్డ్స్
  • గత బుధవారమే వార్ లార్డ్స్ తో అధ్యక్షుడి సమావేశం
Talibans Strike Mazar e Sharif Warlords Stop them with retalliation
ఎలాంటి అడ్డూ..అదుపూ లేకుండా ఒక్కొక్క నగరాన్ని ఆక్రమించుకుంటూ పోతున్నారు తాలిబన్లు. అడ్డొచ్చిన వారిని అడ్డంగా కాల్చేస్తున్నారు. అదే క్రమంలో ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ ఉత్తరాదిన ఉన్న ‘మజారీ షరీఫ్’ అనే సిటీ ఆక్రమణకూ వెళ్లారు. కానీ, ఈసారి వాళ్లకు అది అంత ఈజీగా దక్కలేదు. నల్లేరు మీద నడకే అనుకున్న తాలిబన్లకు.. అక్కడి వార్ లార్డ్స్ (తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న మిలీషియా గ్రూపు) కంటకంలా అడ్డు తగిలారు.

దీంతో ఆ నగరం ఇప్పుడు తుపాకుల మోత, రాకెట్లు, బాంబుల వర్షంతో దద్దరిల్లుతోంది. వార్ లార్డ్స్, తాలిబన్ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే, ఆ పరస్పర దాడుల్లో ఎంత మంది చనిపోయారన్నది ఇంకా తెలియరాలేదు. తాలిబన్లు నగరాన్ని చుట్టుముట్టారని, నలువైపుల నుంచి దాడులు చేస్తున్నారని బల్ఖ్ ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి మునీర్ అహ్మద్ ఫర్హాద్ చెప్పారు. తాలిబన్లు పెద్ద పెద్ద రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారని, వార్ లార్డ్స్ తో సరిహద్దుల్లో హోరాహోరీ సాగుతోందన్నారు.

వాస్తవానికి గత బుధవారమే కొందరు మిలీషియా కమాండర్లతో దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సమావేశమయ్యారు. అది జరిగిన రెండు రోజులకే తాలిబన్లు ఆ సిటీవైపు కదలడం.. మిలీషియా సభ్యులు అడ్డు తగలడం జరిగిపోయాయి. ఈ హోరాహోరీ ఎక్కడికి దారితీస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.