USA: వారి ఒంట్లో పాము డీఎన్​ఏ ఉందంటూ.. తన పిల్లలను చంపేసిన తండ్రి!

US Man Kills His Sons Over Suspicion Of Serpent DNA
  • అమెరికాకు చెందిన వ్యక్తి ఘాతుకం
  • మెక్సికోకు తీసుకెళ్లి హత్య
  • తన భార్య నుంచే ఆ డీఎన్ఏ వచ్చిందంటూ కామెంట్
మూఢ నమ్మకాలతో ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలి తీసుకున్నాడో కసాయి తండ్రి. వారి శరీరంలో పాము డీఎన్ఏ ఉందని, వారు పిశాచాలై ప్రపంచాన్ని నాశనం చేస్తారన్న అపోహలతో అత్యంత పాశవికంగా హత్య చేశాడు. చేపలను వేటాడే గాలం బాణంతో పొడిచి చంపేశాడు. అమెరికాలో జరిగిన ఈ ఘటన వివరాలను ఎఫ్ బీఐ అధికారులు వెల్లడించారు. అధికారులు అడిగితే.. ‘ప్రపంచాన్ని కాపాడాను’ అంటూ సమాధానమిచ్చాడు. ఆ పాము డీఎన్ఏ తన భార్య నుంచే పిల్లలకు సంక్రమించిందన్నాడు.

కాలిఫోర్నియాలోని మాథ్యూ టేలర్ కోల్ మన్ (40) అనే వ్యక్తి ఆగస్టు 7న రెండేళ్లు, పది నెలల వయసున్న తన ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. భార్య అడిగితే పిక్నిక్ కు తీసుకెళ్తున్నానని చెప్పినా.. ఎక్కడికన్నది మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించకపోవడంతో అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్ లొకేషన్ ఆధారంగా అతడు మెక్సికో వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు.

తిరిగి దేశంలోకి ప్రవేశించగానే అతడిని అరెస్ట్ చేశారు. పిల్లలను ఏం చేశావ్? అని ప్రశ్నిస్తే చంపేశానన్నాడు. ‘‘నా పిల్లల్లో పాము డీఎన్ఏ ఉంది. క్యువానన్ (అమెరికాలో ఓ మూఢాచారం. పిల్లలను ఎత్తుకెళ్లి చంపి తినేస్తారన్న కల్పిత సిద్ధాంతం), ఏవో తెలియని అతీత శక్తులు నాకు ఆ విషయాన్ని చెప్పాయి. వారు పెరిగి పెద్దయి రాక్షసుల్లా మారుతారు. అందుకే వారి బారి నుంచి ప్రపంచాన్ని కాపాడాను. చేపలను వేటాడే గాలం బాణంతో చంపేశాను. అయితే, పిల్లలకు నా భార్య నుంచే ఆ పాము డీఎన్ఏ వచ్చింది’’ అని అతడు చెప్పాడు.
USA
Crime News
QAnon
Serpent DNA

More Telugu News