స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో తెలుసా..?

14-08-2021 Sat 13:00
  • జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా
  • నీరజ్ శిక్షణ కోసం రూ. 7 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం
  • విదేశాల్లో 450 రోజుల పాటు శిక్షణ
Central govt spent Rs 7 cr for gold medalist Neeraj Chopra
టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించి మన దేశ పేరును నిలబెట్టిన సంగతి తెలిసిందే. నీరజ్ ఘన విజయంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. ఒక్కసారిగా నీరజ్ హీరో అయ్యాడు. 23 ఏళ్ల నీరజ్ కు పలు రాష్ట్రాలు, సంస్థలు నజరానాలను ప్రకటస్తున్నాయి. మరోవైపు నీరజ్ చోప్రా ట్రైనింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందనే ప్రశ్న చాలా మంది మదిలో మెదిలింది. దీనికి సంబంధించి వివరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) అధికారులు వెల్లడించారు.
 
నీరజ్ చోప్రా శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ. 7 కోట్లను వెచ్చించిందని సాయ్ తెలిపింది. నీరజ్ 450 రోజుల పాటు విదేశాల్లో శిక్షణ తీసుకున్నాడని, పాటియాలాలోని నేషనల్ కోచింగ్ క్యాంప్ లో 1,167 రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడని పేర్కొంది. ఆయన కోసం కేంద్ర ప్రభుత్వం 177 జావెలిన్స్ ను సమకూర్చిందని తెలిపింది. రూ. 74.28 లక్షలతో జావెలిన్ త్రో మెషిన్ ను కేంద్రం కొనిచ్చిందని వెల్లడించింది.