ఆగస్టు 14 ఇక ‘విభజన భయానకాల స్మారక దినం’: ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన

14-08-2021 Sat 12:23
  • దేశ విభజన నాటి గాయాలను మరువలేం
  • బుద్ధిలేని హింసతో ఎంతో మంది చనిపోయారు
  • వారి త్యాగాలను గుర్తు చేసుకుందామని పిలుపు
August 14th Can be Commemorated as Partition Horrors Remembrance Day
దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కొన్ని గంటల ముందు పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చింది. ఆ దేశం భారత్ నుంచి విడిపోయింది. ఆ విభజన సమయంలో కొన్ని లక్షల మందిని ఊచకోత కోశారు. కొన్ని కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలోనే దానిపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 14ను ఇకపై ‘విభజన భయానకాల స్మారక దినం’గా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. ట్విట్టర్ లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘దేశ విభజన నాటి గాయాలను ఎన్నటికీ మరువలేం. కొన్ని లక్షల మంది మన సోదరులు, సోదరీమణులు దేశ విభజన వల్ల నిరాశ్రయులయ్యారు. ఆ బుద్ధి లేని ద్వేషం, హింస వల్ల ఎందరో ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి మనవారి త్యాగాలు, కష్టాలను గుర్తు చేసుకునేందుకు.. ఆగస్టు 14ను ఇకపై ‘విభజన భయానకాల స్మారక దినం’గా ప్రకటిస్తున్నాం’’ అని మోదీ ట్వీట్ చేశారు.

దీనితోనైనా సామాజిక వ్యత్యాసాలు, విరోధం వంటివి తొలగిపోతాయని ఆశిద్దామన్నారు. ఐకమత్యమే మహాబలం అన్న నానుడిని, సామాజిక సామారస్యాన్ని, మానవాళి అభివృద్ధిని బలోపేతం చేసే దిశగా ‘విభజన భయానకాల స్మారక దినం’ పాటిద్దామంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.