ఎల్లుండే కేసీఆర్ హుజూరాబాద్ సభ.. భారీ ఏర్పాట్లు!

14-08-2021 Sat 12:02
  • తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక
  • ఇప్పటికే ప్రచారంలో నిమగ్నమైన పలువురు మంత్రులు
  • కేసీఆర్ సభాస్థలిని పరిశీలించిన హరీశ్ రావు
KCR public meeting in Huzurabad on 16 Aug
హుజూరాబాద్ ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. టీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఈ ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

నియోజకవర్గంతో ఈటలకు బలమైన పట్టు ఉంది. దీంతో ఈ ఉపఎన్నికను టీఆర్ఎస్ అధిష్ఠానం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే పలువురు మంత్రులు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న భారీ బహిరంగసభను నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభాస్థలిని మంత్రి హరీశ్ రావు పరిశీలించారు.

మరోవైపు వాస్తవానికి ఈ నెల మొదటి వారంలో వికారాబాద్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, జగిత్యాల, జనగాం, నిజామాబాద్ జిల్లాల పర్యటనలకు కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఈ పర్యటనలను కేసీఆర్ తాత్కాలికంగా వాయిదా వేశారు. హుజూరాబాద్ సభ అనంతరం జిల్లా పర్యటనలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన వరంగల్, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.