మిశ్రమ డోసులకు మేం వ్యతిరేకం: ‘సీరం’ అధిపతి సైరస్ పూనావాలా

14-08-2021 Sat 09:20
  • మిశ్రమ టీకా డోసులతో మంచి ఫలితాలు వచ్చాయన్న ఐసీఎంఆర్
  • సానుకూల ఫలితాలు రాకుంటే నిందారోపణలకు దారితీస్తుందన్న సైరస్
  • టీకా ఎగుమతుల నిషేధంతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన
SII founder Cyrus Poonawalla objects to mixing of vaccines
టీకా మిశ్రమ డోసులపై ఇటీవల విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) చైర్మన్ సైరస్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు వేర్వేరు కంపెనీల టీకా డోసులకు తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల మిశ్రమంతో మెరుగైన ఫలితాలు కనిపించినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రెండు వేర్వేరు టీకాలు వేసుకున్నప్పుడు సానుకూల ఫలితాలు రాకుంటే రెండు సంస్థల మధ్య పరస్పర నిందారోపణలకు కారణం అవుతుందని పేర్కొన్నారు. దీనికితోడు ఈ విధానాన్ని ఇంకా పూర్తిగా నిర్ధారించలేదని అన్నారు. అలాగే, కొవిడ్ టీకాల ఎగుమతిపై నిషేధం విధించాలనుకోవడం కూడా సరికాదన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ సంస్థ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, ఈ విషయాలేవీ బయట మాట్లాడొద్దని తన కుమారుడు, సంస్థ సీఈవో అదర్ పూనావాలా తనకు సూచించారని అన్నారు. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య రెండు నెలల విరామం సరైందని,  ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు వేసుకోవడం ఉత్తమమని సైరస్ పూనావాలా పేర్కొన్నారు.