పీసీబీ ఆరోపణలపై మేం మాట్లాడదలుచుకోలేదు: గల్లా జయదేవ్

13-08-2021 Fri 18:23
  • తిరుపతిలో అమరరాజా ప్రెస్ మీట్
  • హాజరైన గల్లా రామచంద్రనాయుడు, జయదేవ్
  • భవిష్యత్ ప్రణాళికలకు సమయం పడుతుందన్న జయదేవ్
  • తమిళనాడులో విస్తరణపై నో కామెంట్
Galla Jaydev responds to media questions
ఏపీ నుంచి అమరరాజా పరిశ్రమ తరలిపోతోందన్న నేపథ్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రెస్ మీట్ లో అమరరాజా గ్రూప్ అధినేత గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. తమిళనాడులో అమరరాజా సంస్థ విస్తరణపై జవాబివ్వాలని ఓ మీడియా ప్రతినిధి కోరగా, గల్లా జయదేవ్ కొంచెం కఠినంగా జవాబిచ్చారు.

ఈ అంశం గురించి ప్రెస్ మీట్లో మూడుసార్లు అడిగారని, తాము మూడుసార్లు సమాధానం చెప్పామని స్పష్టం చేశారు. ఇంతకుమించి తాము దీనిపై ఏమీ చెప్పబోమని అన్నారు. తమ భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు.

అటు, పీసీబీ నోటీసులపై వివరణ ఇచ్చేందుకు కూడా గల్లా జయదేవ్ ఆసక్తి చూపించలేదు. న్యాయపరిధిలో ఉన్న అంశమని తెలిపారు. అమరరాజా అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారని, వాటిపై అయినా స్పందిస్తారా? అని ఓ దినపత్రిక రిపోర్టర్ అడగ్గా, మ్యాటర్ ఒక్కటే కదా అని అన్నారు. తాము దీనిపై మాట్లాడబోవడంలేదని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు.