వైయస్ సునీత చేసిన ఫిర్యాదు అందింది: కడప ఎస్పీ

13-08-2021 Fri 17:45
  • తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన సునీత
  • ఆమె కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామన్న ఎస్పీ
  • సునీత పేర్కొన్న అంశాలపై తక్షణమే విచారణ చేపడతామని వ్యాఖ్య
Received YS Sunitha complaint letter says Kadapa SP
తమ ప్రాణాలకు ముప్పు ఉందని మాజీ ఎంపీ, దివంగత వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైయస్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో సునీత లేఖ ద్వారా చేసిన ఫిర్యాదు తమకు అందిందని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. ఆమె కుటుంబ రక్షణ కోసం రక్షణ చర్యలను చేపట్టామని చెప్పారు. వారికి వ్యక్తిగత రక్షణ కల్పించడంతో పాటు, పులివెందులలో వారి నివాసం వద్ద సెక్యూరిటీని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. లేఖలో సునీత పలు విషయాలను పేర్కొన్నారని... వాటన్నింటిపై తక్షణమే విచారణ చేపడతామని చెప్పారు.

ఈనెల 10వ తేదీ సాయంత్రం 5.20 గంటలకు ఒక అనుమానితుడు తమ ఇంటి చుట్టూ తిరిగారని ఫిర్యాదు లేఖలో సునీత పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేశాడని తెలిపారు. వివేకా హత్య కేసు అనుమానితుడు శివశంకర్ రెడ్డి పుట్టినరోజున ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఉన్న మణికంఠరెడ్డి అనే వ్యక్తి మాదిరే అతను ఉన్నాడని చెప్పారు. తమ కుటుంబ భద్రత పట్ల ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు.