ఫస్టు సింగిల్ తోనే ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిన 'పుష్ప'

13-08-2021 Fri 17:25
  • 'పుష్ప' నుంచి వచ్చిన 'దాక్కో దాక్కో మేక' సాంగ్ వీడియో 
  • తక్కువ సమయంలో సాధించిన 400K లైక్స్
  • ఊపేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ బీట్ 
  • హైలైట్ గా నిలుస్తున్న కొరియోగ్రఫీ 

All time record for Pushpa movie single
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా ముగింపు దశకి చేరుకుంది. వచ్చే నెలతో షూటింగు పార్టును పూర్తిచేసుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును వదిలారు.

'దాక్కో దాక్కో మేక .. ' అంటూ ఈ పాట కొనసాగుతోంది. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను శివమ్ ఆలపించాడు. ఈ కథ అడవి నేపథ్యంలో సాగుతుంది .. అందువలన ఆటవిక న్యాయాన్ని గురించి చెబుతూ ఈ పాట నడుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ బీట్ తో పాటు, కొరియోగ్రఫీ ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఇలా ఈ పాటను వదిలారో లేదో అలా దూసుకుపోయింది. 182 నిమిషాల్లోనే 400K లైక్స్ ను సాధించింది. టాలీవుడ్ లో ఇంతవరకూ ఇంత వేగంగా .. ఇంత తక్కువ సమయంలో ఈ ఫీట్ ని సాధించిన లిరికల్  వీడియో ఇదేనని చెబుతున్నారు. ఫస్టు సింగిల్ తోనే కొత్త రికార్డును సాధించిందని చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, 'క్రిస్మస్' కు విడుదల చేయనున్నారు.