పెట్రోల్ ధరను తగ్గించిన సీఎం స్టాలిన్

13-08-2021 Fri 16:46
  • పెట్రోల్ పై రూ. 3 మేర ట్యాక్స్ తగ్గింపు
  • మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ప్రకటన
  • డీజిల్ ధర మాత్రం యథాతథం
CM Stalin reduced petrol rate
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూ లేని విధంగా ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు పెరుగుతూ పోవడమే కానీ... తగ్గిన సందర్భాలు చాలా తక్కువ. దాదాపు అన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర సెంచరీ దాటేసింది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న సుంకాలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న పన్నును రూ. 3 మేర తగ్గించారు. ఈరోజు అసెంబ్లీలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, డీజిల్ పై మాత్రం ఎలాంటి ఊరటను ఇవ్వకపోవడం గమనార్హం.

లీటర్ పెట్రోల్ పై రూ. 3 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా దాదాపు రూ. 1,160 కోట్ల మేర భారం పడనుంది. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102గా ఉండగా... లీటర్ డీజిల్ ధర రూ. 94.39గా ఉంది. రేపటి నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయి.

మరోవైపు మధ్యంతర బడ్జెట్ లో స్టాలిన్ ప్రభుత్వం పలు ఆకర్షణీయ నిర్ణయాలను ప్రకటించింది. వీటిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మాతృత్వ సెలవులను 9 నెలల నుంచి 12 నెలలకు పెంచడం, ట్రాన్స్ జెండర్లకు పెన్షన్ వంటివి ఉన్నాయి.