ఎన్టీఆర్, కొరటాల చిత్రానికి సంగీత దర్శకుడు ఫిక్స్?

13-08-2021 Fri 16:28
  • 'ఆర్ఆర్ఆర్' తర్వాత కొరటాలతో ఎన్టీఆర్
  • పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
  • సంగీత దర్శకుడిగా అనిరుధ్ ఎంపిక    
Music director fixed for NTR film
సినిమాకి సంగీతం ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ముఖ్యంగా స్టార్ హీరోలు నటించే సినిమాల విషయంలో దీనికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. తమ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి ఆయా హీరోలకు మంచి ట్యూన్స్ తో కూడిన పెప్పీ నెంబర్స్ అవసరం అవుతాయి. అందుకే, సంగీత దర్శకుడి విషయంలో కాస్త కసరత్తు చేసి మరీ ఎంచుకుంటూ వుంటారు.

ఇక మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి చెప్పేక్కర్లేదు. తన పాటలతో మ్యూజిక్ సెన్సేషన్ గా పేరుతెచ్చుకున్న ఈ కుర్రాడు తమిళంలో బాగా బిజీ. స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు. అలాంటి అనిరుధ్ ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేయనున్నాడు.. అది కూడా ఎన్టీఆర్ సినిమా కావడం ఇక్కడ మరో విశేషం!

ప్రస్తుతం రాజమౌళితో 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్న ఎన్టీఆర్ .. ఇది పూర్తవగానే కొరటాల దర్శకత్వంలో ఓ భారీ చిత్రాన్ని చేయనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పని కూడా పూర్తయింది. ప్రస్తుతం ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని ఎంచుకున్నట్టు తాజా సమాచారం. ఈ చిత్రానికి పనిచేయడానికి అనిరుధ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది.