సొంతింటి వేట కొడవలే వివేకాని వేటాడినట్టు స్పష్టం అవుతోంది: నారా లోకేశ్

13-08-2021 Fri 16:26
  • వివేకా వ్యవహారంలో లోకేశ్ వ్యాఖ్యలు
  • గతంలో చంద్రబాబుపై ఆరోపణలు చేశారని కామెంట్ 
  • సాక్షిలో గ్రాఫిక్స్ తో కథనం వేశారని ఆరోపణ
  • ఇప్పుడు సాక్షిలో ఏం రాస్తారో చూస్తానన్న లోకేశ్ 
Nara Lokesh comments in the wake of Viveka case

వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతర పరిణామాలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. నాడు వివేకా హత్య జరగ్గానే నారాసుర రక్తచరిత్ర అంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తూ పత్రికా కథనం వెలువరించడంపై లోకేశ్ తాజాగా మండిపడ్డారు.

కోట్ల కోసం సొంత బాబాయ్ పై గొడ్డలి వేటు వేసి, మీ చేతికంటిన నెత్తురును చంద్రబాబు గారికి ఎలా పూశారు జగన్ గారూ? అంటూ ప్రశ్నించారు. రక్తసంబంధీకుడు, సొంత బాబాయ్ పై గొడ్డలివేటు వేసి, ఓట్ల కోసం నారాసుర రక్తచరిత్ర అంటూ విషపుత్రిక సాక్షిలో గ్రాఫిక్స్ తో చంద్రబాబు చేతిలో గొడ్డలి పెట్టి అచ్చు వేయించారని లోకేశ్ ఆరోపించారు.

"కానీ ఇప్పుడు మీ తరతరాల వైఎస్సాసుర రక్తచరిత్ర అంతా నేరాలమయం అని మరోసారి సీబీఐ దర్యాప్తులో తేటతెల్లమైంది. మీ బ్లడ్ గ్రూప్... ఫ్యాక్షన్. అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్... వైఎస్ కుటుంబం. దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలపై వైఎస్ కుటుంబానికి పేటెంట్ హక్కులున్నాయి.

వైఎస్ వంశ రక్తచరిత్రకు తాజా సాక్ష్యం వివేకానందరెడ్డి హత్య. వైఎస్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిని సీబీఐ పిలిపిస్తుంటే అది ఇంటిగొడ్డలేనని, సొంతింటి వేటకొడవలే వివేకాను వేటాడిందని స్పష్టమవుతోంది. డబ్బు, ఆధిపత్యం, గనులు, అక్రమాల కోసం సొంత బాబాయ్ నే చంపుకున్నారు. జగన్ రెడ్డీ... ఇప్పుడు నీ వైఎస్సాసుర కుటుంబ రక్తచరిత్రను నీ దొంగ పేపర్ సాక్షిలో ఎలా అచ్చు వేస్తావో చూస్తాను" అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు.