ఏపీ సర్కారుకు అప్పులు ఇవ్వొద్దు: బ్యాంకులకు సూచించిన రఘురామకృష్ణరాజు

13-08-2021 Fri 14:14
  • ఏపీ సర్కారుపై రఘురామ వ్యాఖ్యలు
  • కాలేజీల ఆస్తుల విక్రయానికి ప్రయత్నిస్తోందని ఆరోపణ
  • విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని కామెంట్ 
  • ఏపీకి రుణాలు ఇస్తే ఇబ్బందులేనన్న రఘురాజు   
Raghurama Krishna Raju asks banks do not lend money to AP Govt
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కార్పొరేషన్ పేరిట రుణాలకు ప్రయత్నిస్తోందని తెలిపారు. ఎయిడెడ్ కళాశాలల ఆస్తులను అమ్ముకునేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి మారాల్సి ఉందని అన్నారు. కళాశాలలను ప్రభుత్వానికి అప్పగించరాదని, విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పారు.  

ఎయిడెడ్ కాలేజీల ఆస్తులపై ప్రభుత్వం కన్ను పడిందని తెలిపారు. ఏపీ ఎడ్యుకేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, దాని కింద ఎయిడెడ్ కాలేజీల ఆస్తులను చూపి అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కాలేజీల ఆస్తులు అమ్మితే ఇంకో లక్ష కోట్లు వస్తాయని, దాంతో మరో ఏడాది పాటు నడిపించవచ్చని అనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వం అప్పులు అడిగితే ఇవ్వొద్దని రఘురామ బ్యాంకులకు సూచించారు. పలుమార్లు నిబంధనలు అతిక్రమించిన సర్కారుకు రుణాలు ఇవ్వడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని బ్యాంకులకు చెప్పారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.