మరో రెండు నగరాలు తాలిబన్ల వశం.. మహిళలపై ఆగడాలు

13-08-2021 Fri 13:14
  • కాందహార్ , లష్కర్ గా నగరాలు స్వాధీనం
  • ధ్రువీకరించిన ఆర్మీ అధికారి
  • ఒప్పందం ప్రకారం విడిచివెళ్లామని వెల్లడి
Talibans Capture Another Two Key Cities In Afghanistan
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్లు పేట్రేగిపోతున్నారు. వరుసబెట్టి నగరాలను ఆక్రమించుకుంటున్నారు. తాజాగా అత్యంత కీలకమైన కాందహార్, లష్కర్ గా నగరాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. హెరాత్ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘన్ సైన్యం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించింది.

ఉగ్రవాదులతో కుదిరిన ఒప్పందం మేరకు ఆ నగరాన్ని విడిచివెళ్లిపోయినట్టు ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాందహార్ ను పూర్తిగా అధీనంలోకి తీసుకున్నామని, ముజాహిదీన్లు మార్టిర్స్ స్క్వేర్ కు చేరుకున్నారని తాలిబన్ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఆక్రమించుకుంటున్న నగరాల్లో మహిళలపై తాలిబన్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఉగ్రవాదులతో మహిళలకు బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నారని ఓ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. సైనికులను కాల్చి చంపేస్తున్నారని, ప్రజలపైనా దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.